KTR Letter to Nirmala Seetharaman: జీఎస్టీ కౌన్సిల్‌లో వస్త్రాలపై పన్ను పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతూ.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ పెంపు వల్ల వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది కార్మికుల జీవితాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ పెంపు వల్ల చేనేత, జౌళి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని.. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందిపడతారన్నారు. కేంద్రం మొండిగా ముందుకెళ్తే నేతన్నలు తిరగబడతారని హెచ్చరించారు. జీఎస్టీ పెంపుపై ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని.. రైతుల మాదిరిగానే నేతన్నలు కేంద్రంపై తిరగబడతారని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
మా విన్నపం వినకపోయినా సరే..
KTR Tweet On Textiles GST: ఇదే అంశంపై.. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా.. కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్‌ను మంత్రి కోరారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్‌తో పాటు గుజరాత్ భాజపా అధ్యక్షుడు కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని ట్వీట్లో ఉటంకించారు.
పలుమార్లు కేటీఆర్ విన్నపాలు..
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతం పెంచుతూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్.. ఇంతకుమునుపై లేఖ రాశారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్ను లేదని.. కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం విధించినప్పుడే.. తీవ్ర వ్యతిరేకత ఎదురైనట్లు లేఖలో మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో 7 శాతం విధించడం సబబు కాదని.. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మరోమారు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ స్పందించారు. మేకిన్ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం... స్వదేశంలో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమకు సహకారం అందించాల్సింది పోయి.. జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని వ్యాఖ్యానించారు. జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని మంత్రి మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ తగ్గించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిన మంత్రి.. ప్రస్తుతం మరోసారి ట్విట్టర్ వేదికగా విన్నవించుకున్నారు.
జనవరి నుంచి అమల్లోకి..
2018-19 ఆర్థిక ఏడాదిలో టెక్స్‌టైల్ రంగానికి ఐటీసీ ద్వారా రూ.6000 కోట్లు రీఫండ్ ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పన్ను విధింపుపై సుదీర్ఘంగా చర్చించారు. వస్త్రపరిశ్రమపై ఫిట్‌మెంట్ కమిటీని వేసిన కౌన్సిల్... ప్రతిపాదనలు తెప్పించింది. ఈ ఏడాది సెప్టెంబరులో లక్నోలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్త్రపరిశ్రమపై 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని, దానిని జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
సంబంధిత కథనాలు..
KTR about Textiles GST : జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్