ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ ( cm kcr) లక్ష్యమని మంత్రి కేటీఆర్ (minister ktr) అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. పాతబస్తీకి ఏడేళ్లలో పురపాలక, ఇతర శాఖల ద్వారా రూ.14,887 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 2004-14 మధ్య కాంగ్రెస్ రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఏ కార్యక్రమం తీసుకున్నా... పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా... ఏ వివక్ష చూపెట్టకుండా... అమలు చేశాం. ఒక చిన్న ఉదహరణ.. 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఒక హామీ ఇచ్చారు. మా అభ్యర్థిని గెలిపించండి... ములుగును జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు. కానీ అక్కడి ప్రజలు వేరే తీర్పును ఇచ్చారు. కానీ కొంత సమయంలోనే ములుగును జిల్లాగా ప్రకటించారు. ఏ వివక్ష లేకుండా... అభివృద్ధిని చేస్తున్నాం.
- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
వంద కోట్లైనా ఖర్చు చేస్తాం..
స్వాతంత్య్రం వచ్చాక పాతబస్తీలో ఇంత పెద్దఎత్తున రోడ్ల అభివృద్ధి ఎప్పుడూ జరగలేదన్నారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు మరో వంద కోట్లైనా ఇస్తామని తెలిపారు. అభివృద్ధిలో పాత, కొత్త నగరాలన్న తేడా లేదన్నారు. రాజాసింగ్ చెబుతున్నట్లు ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపడం లేదని తెలిపారు. సెవెన్ టూంబ్స్, గోల్కొండకు ప్రపంచ వారసత్వ హోదాకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. మీర్‌ఆలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. పాతబస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుందని ప్రకటించారు. కరోనా వల్ల పాతబస్తీకి మెట్రో రైలు కొంత ఆలస్యమైందని వివరించారు.