వచ్చే 30 ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేశవాపూర్ బ్యాలెన్సింగ్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన 1490 ఎకరాల భూసేకరణ పూర్తి కావచ్చిందని తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కేశవాపూర్ రిజర్వాయర్ పనులపై సమీక్షించారు. రిజర్వాయర్ పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సమస్య ఉండదని మంత్రి అన్నారు.
'హైదరాబాద్లో 2050 వరకు తాగునీటికి ఏ కొరతా ఉండదు' - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కేశవాపూర్ రిజర్వాయర్ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. కేశవాపూర్ బ్యాలెన్సింగ్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

గ్రేటర్ చుట్టూ కొత్తగా మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే నగరంలో 770 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధీకరణ కొనసాగుతున్నదని, ఇది దేశంలోని అన్ని నగరాల్లోకన్నా అత్యధికమన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్టీపీలకు అదనంగా మరో 1200 ఎంఎల్‌డీల సామర్థ్యంతో కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, నివేదికను వారంలోగా సమర్పించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ను ఆదేశించారు. వీటిని మూసీకి అనుసంధానం చేయడం ద్వారా నది ప్రక్షాళన జరిగేలా ప్రణాళికలు ఉండాలన్నారు. సమావేశంలో జలమండలి ఈడీ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్