హైదరాబాద్ జంట నగరాల్లో తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయన్నారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు. జలమండలి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
శాశ్వత పరిష్కారం!
కేశవాపురం రిజర్వాయర్కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అటవీశాఖ అనుమతులకు సంబంధించి మరింత వేగంగా ముందుకు పోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని కేటీఆర్ అన్నారు.