KTR on MODI: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలు, వ్యంగాస్త్రాలు సంధించారు. నాడు మహాత్మాగాంధీజీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి "ఆత్మ నిర్భర్" చిహ్నంగా "చరఖా" ఉపయోగిస్తే... ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిమంత్రిగా మోదీ గుర్తింపు సాధించారని ఆక్షేపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రి ఘాటుగా స్పందించారు. ఇదేనా మీరు సాధించిన "ఆత్మ నిర్భర్ భారత్"...? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియచెప్పే స్వదేశీ నినాదం...? అంటూ ఎద్దేవా చేశారు.
KTR on MODI: 'కేంద్రం చెప్పే స్వదేశీ నినాదం ఇదేనా?' - కేటీఆర్ ట్వీట్
KTR on MODI: సోషల్ మీడియా వేదికగా రాష్ట్రమంత్రి కేటీఆర్... మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన నేతగా రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు. ఇదేనా భాజపా సాధించిన "ఆత్మ నిర్భర్ భారత్"... అని ప్రశ్నించారు.
ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ కానుకగా ప్రకటించిన రైతుబంధు బీమా తరహాలో చేనేత బీమా పథకంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తిప్పికొట్టారు. గత 8 సంవత్సరాల్లో తెలంగాణలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో మాకెందుకు చెప్పరు...? అని సూటిగా ప్రశ్నించారు. అలాగే... కరీంనగర్ ఎంపీగా సంజయ్‌కుమార్ జిల్లా అభివృద్ధి కోసం ఏం చేశారని నిలదీశారు. కనీసం తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల పట్టణంలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.