Carpenter Talent: కళలకు పెట్టింది పేరైన విశ్వకర్మల చేతుల్లో ఎన్నో కళాకండాలు జీవం పోసుకుంటాయి. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు.. జీవనవిధానాన్ని సౌకర్యవంతంగా, కళాత్మకంగా తీర్చిదిద్దటంలో వాళ్లదే సింహభాగం అనంటంలో అతిశయోక్తిలేదు. అలాంటి విశ్వకర్మల్లో ఒకరైన వడ్రంగులు.. అప్పటి నాగలి నుంచి ఇప్పటి ట్రెడ్‌మిల్ వరకు ఏది చేసినా అది వారి చేతుల్లో ఉన్న వైవిధ్యమే...! అదేంటీ.. వడ్రంగి అంటే కలపతో పని చేసే వాళ్లు కదా.. మధ్యలో ట్రెడ్‌మిల్ ఎందుకొచ్చింది అనుకోకండి. విద్యుత్‌తో పనిచేసే యంత్రాన్ని పోలిన పరికరాన్ని కలపతో చేసి.. తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు ఓ వడ్రంగి. ఈ విషయం ట్విటర్ ద్వారా స్వయంగా మంత్రి కేటీఆరే.. పంచుకున్నారు.
నడక ద్వారా వ్యాయామానికి ఉపయోగపడే ట్రెడ్‌మిల్‌ను కలప ద్వారా రూపొందించి.. ఎలాంటి విద్యుత్, మోటారు వినియోగం లేకుండా అతి తేలికగా నడుపుతున్న ఒక వడ్రంగి నైపుణ్యాన్ని చూసి మంత్రి కేటీఆర్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తనకు ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా తెలియజేయగా... ఆ కళాకారుడిని అభినందించారు.