వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతాం: మంత్రి కేటీఆర్
16:14 September 20
వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ సమావేశం
KTR Meets VRAs: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేందుకు, ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ సూచించారు. వీఆర్ఏల ప్రతినిధులతో హైదరాబాద్ బేగంపేట మెట్రోభవన్లో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. డిమాండ్ల సాధన కోసం గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు... ఇటీవల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
వారితో ఆ రోజు చర్చలు జరిపిన మంత్రి కేటీఆర్... జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉన్నందున ఈ నెల 20వ తేదీన సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇవాళ వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి, అధికారులు సమావేశమయ్యారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు అన్న భావన తగదని స్పష్టం చేశారు. ఆందోళన విరమించి వెంటనే రోజువారీ విధుల్లో చేరాలని వీఆర్ఏలను మంత్రి కేటీఆర్ కోరారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉందన్న వీఆర్ఏ ప్రతినిధులు... ఇచ్చిన మాట ప్రకారం సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. 25 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న వీఆర్ఏల సమస్యలు వీలైననంత త్వరగా పరిష్కరించాలని మంత్రి, అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: