KTR Letter to Piyush Goyal: దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగం ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమని ఎండగడుతూ.. కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను తన లేఖలో పొందుపరిచారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము... అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్ల నుంచి చేనేత రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీకైన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ సర్కారు.. టెక్స్‌టైల్ - చేనేత రంగంపై కూడా కక్ష కట్టిందని ఆరోపించారు. అందుకే ఆ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచింకుండా చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ నేతన్నల పొట్టగొడుతుందని విమర్శించారు.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ...? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ.. తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్ పార్క్ ఎక్కడ ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సూమారు 1552 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే... ఇప్పటి వరకు స్పందించని కేంద్రం.. మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అనేక చిన్న దేశాలు చేనేత రంగంలో మనకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తున్నాయన్న కేటీఆర్... ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాల లేమినే కారణమని విమర్శించారు. అయితే... సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంతో పోటీ పడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైబర్ టూ ఫ్యాషన్ మోడల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ప్రపంచ టెక్స్‌టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన సంగతి గుర్తు చేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యత కలిగిన మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కీలక పవర్లూమ్ మగ్గాల అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వం 50 శాతం నిధులు భరించేందుకు సిద్ధంగా ఉన్నా... అందుకు సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా కూడా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.