KTR Letter To Nirmala Seetharaman: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు పలు అంశాల పైన నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్ సవివరమైన లేఖలు రాశారు. నిర్మలా సీతారామన్ సూచనతో తెలంగాణలో నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడం లేదని.. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రకక్షన్లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్‌కు సంబంధించి 8 ఏళ్ల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చులు భరించాలన్నారు. ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్లను గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నొడ్ల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌలిక వసతుల కల్పన చేసేందుకు సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్లో భాగంగా మంచిర్యాల నోడ్‌ను కొత్తగా గుర్తించాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లలోని ఈ మూడు నోడ్లకు 2వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6 వేల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే హుజూరాబాద్, జడ్చర్ల- గద్వాల్ - కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామని.. ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఒక్కొదానికి 1500 కోట్ల రూపాయల చొప్పున.. మొత్తం 3వేల కోట్ల రూపాయలను రానున్న బడ్జెట్లో కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్‌ను చేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందని.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువని వెల్లడించారు. దీంతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌తో పాటు పలు అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. వీటితో పాటు టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌తో పాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ, ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులు ఉన్నాయని.. దీంతో పాటు త్వరలో మరో భారీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లోనూ ఏరోస్పేస్ క్లస్టర్ని సిద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు.