సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శలు కూడా దీవెనలుగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. భట్టి తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. భట్టి లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే స్పష్టంగా సమాధానాలిచ్చానని తెలిపారు. తమ హయాంలో వచ్చిన పరిశ్రమలపై సభకు వివరించానని... మరోసారి చెప్పమన్న చెబుతానని మంత్రి అన్నారు. తమ హయాంలో హైదరాబాద్కు ఏయే కంపెనీలు వచ్చాయో చర్చకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి : కేటీఆర్
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శలకు మంత్రి కేటీఆర్ తనదైశ శైలిలో సమాధానాలిచ్చారు. శాసనసభలో హైదరాబాద్ ప్రగతి, పట్టణాభివృద్ధిపై జరిగిన చర్చలో తెరాస హయాంలో ఏ ఒక్క కంపెనీ రాలేదని భట్టి విమర్శించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్... భట్టి విమర్శలు తనకు దీవెనలని అన్నారు. భట్టి తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమమైన ఐటీ కంపెనీల్లో నాలుగు తమ హయాంలోనే వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. ఆ సంస్థల రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలని.. ఇంకా చాలా పెద్ద జాబితే ఉందన్నారు. సవివరమైన నివేదికను భట్టికి పంపిస్తానని చెప్పారు. మైకు ముందు ఆవేశంగా ఊగిపోతూ తెరాస ప్రభుత్వంపై ఏదో ఓ విమర్శలు చేయడం ఆపాలని... వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పి... కేటీఆర్ ప్రసంగం ముగించారు.
ఇదీ చదవండి:ప్రజలను భ్రమల్లో ఉంచి పరిపాలన చేస్తున్నారు: భట్టి