హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి రాయదుర్గం లెదర్‌పార్కు వరకు నిర్మించిన లింక్ రోడ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వీయూపీ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చడం కోసం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్స్ అన్నింటిని పరిశీలించినట్లు మంత్రి వెల్లడించారు.
రూ.313.65 కోట్ల వ్యయంతో లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతుందని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని జేఎల్‌ఎల్ సంస్థ ఇటీవల ప్రకటించినట్లు తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
కీలక ప్రాంతాలను కలిపే లింక్ రోడ్లు ఇంతవరకు లేవని... ఆ ప్రధాన రహదారుల ఒత్తిడి తగ్గించేందుకు లింక్ రోడ్లు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు మూడు రోడ్లు ప్రారంభించామని... ఇంకా 35 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పూర్తిగా 137 లింక్ రోడ్ల కోసం ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. దశల వారీగా అందుబాటులో తీసుకువస్తామన్నారు. ఇందుకోసం రూ.313.65 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
ఇవీచూడండి:మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం.. తేలనున్న భవితవ్యం