రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకోవాల్సిన సంస్కరణలపై అధికారులకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వేగంగా పని చేయాలని ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఒకే చోట అన్ని సేవలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణల ద్వారా ఆయా డిపార్ట్మెంట్ సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. దీంతో పాటు ప్రజలకు ఏ సేవ అయినా ఒకే చోట అందించే విధంగా సిటీజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్ అవసరాన్ని ఈ సమావేశంలో చర్చించారు. తద్వారా ఏ సేవ అయినా నేరుగా ఆన్ లైన్ ద్వారా అందుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు.