తమ నినాదం విశ్వనగరమైతే... భాజపాది విద్వేష నగరమని కేటీఆర్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్‌నగర్, సికింద్రాబాద్ శాంతినగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. భాజపా వాళ్లకు ఏ మాత్రం విషయం లేదు... కేవలం విషం మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. దిల్లీ నుంచి 15 మంది వరకు ఉత్త చేతుల్తో ప్రత్యేక విమానాల్లో వస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతికి తట్టెడు మట్టి తెచ్చారు కానీ... హైదరాబాద్‌కు అది కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
ఇన్సూరెన్స్ ఏజెంట్‌వా? పార్టీ ప్రెసిడెంట్‌వా?
ఐటీ హబ్ తీసుకొస్తామంటున్న అమిత్ షా నగరానికి రూపాయి ఇవ్వకపోగా రుబాబు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేస్తామంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యూపీఏ హయాంలో నగరానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రద్దు చేసిన మీరే ఐటీ హబ్‌గా మారుస్తామంటే ఇక్కడ నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వరదల్లో ద్విచక్ర వాహనాలు పాడైతే ఇన్స్యూరెన్స్ పరిహారం ఇప్పిస్తామంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇన్సూరెన్స్ పరిహారాన్ని ఆయా సంస్థలే ఇస్తాయని.. మీరిచ్చేదేంటని ప్రశ్నించారు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌వా? పార్టీ ప్రెసిడెంట్‌వా? అంటూ పరోక్షంగా సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై చేసేవాటని సర్జికల్ స్ట్రైక్స్ అంటారని.. హైదరాబాద్ శత్రుదేశంలా కనిపిస్తోందా?అని ప్రశ్నించారు. ఎక్కడ మత ఘర్షణలు జరిగాయని అమిత్‌షా ప్రశ్నిస్తున్నారని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సమయంలో దిల్లీలో జరగలేదా? అని నిలదీశారు