'నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు..'- మంత్రి కేటీఆర్ వివరణ..
05:28 April 30
'నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు..'- మంత్రి కేటీఆర్ వివరణ..
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో... మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. క్రెడాయ్ సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు.. ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధపెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నానన్న కేటీఆర్.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
'పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు.' - సమావేశంలో కేటీఆర్ అన్న మాటలు..
సంబంధిత కథనం..