తెలంగాణ

telangana

ETV Bharat / city

Ask KTR: టీకాల ప్రక్రియలో కేంద్రం వైఫల్యం: కేటీఆర్​

ట్విట్టర్​ వేదికగా ఆస్క్​ కేటీఆర్​ ట్యాగ్​తో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేదని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టీకాల వృథా తక్కువగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని తెలిపారు.

minister ktr comments on lake of vaccine in telangana in twitter
minister ktr comments on lake of vaccine in telangana in twitter

By

Published : Jun 6, 2021, 9:34 PM IST

Updated : Jun 7, 2021, 7:30 AM IST

కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లనే దేశంలో కొవిడ్‌ టీకాల కొరత ఏర్పడిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా నిల్వ చేయకుండా ఎగుమతులు చేయడం, తయారీ సంస్థలకు అనుమతుల్లో జాప్యం వంటి లోపాలను ఆయన ఎత్తి చూపారు. అమెరికా, ఇజ్రాయెల్‌ లాంటి దేశాలు సగానికి పైగా జనాభాకు టీకాలను అందించగా... మన దేశంలో కనీసం 10 శాతం కూడా వేయలేదన్నారు. కరోనా మూడో దశపై ఇప్పుడే ఆందోళన నెలకొనగా అసలు కేంద్ర ప్రభుత్వానికి టీకాల సరఫరాపై ఒక ప్రణాళిక ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కేటీఆర్‌ను అడగండి (ఆస్క్‌ కేటీఆర్‌) పేరిట ఆదివారం ఆయన ట్విటర్‌లో టీకాలకు సంబంధించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కెనడా ఒక్కో వ్యక్తికి 9 డోస్‌లు సిద్ధం చేస్తోంది

‘‘ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా వంటి దేశాలన్నీ తమ పౌరులకు టీకాలను ఉచితంగా అందిస్తుంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజలపై భారం మోపుతోంది. అమెరికా, కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే టీకాలను సమకూర్చుకున్నాయి. కెనడా ఒక్కో వ్యక్తికి తొమ్మిది డోస్‌ల చొప్పున టీకాలు సిద్ధం చేస్తోంది. ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ 2020 మొదట్లోనే టీకాల కోసం ఆర్డర్లు ఇవ్వగా భారత ప్రభుత్వం మాత్రం ఆలస్యంగా నిద్రలేచింది. 2021 జనవరిలో ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మే 1 తర్వాతనే కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలనే ఆంక్షలు విధించింది.

విదేశాల్లోని మిగులు డోసులను తెప్పించండి

దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకొస్తున్నాయి. ధర విషయంలో రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులతో పోటీ పడాల్సి వస్తోంది. అంతర్జాతీయ టీకా తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. అంతర్జాతీయ కంపెనీలను కేంద్రం అనుమతించడం లేదు. 2020 చివరిలో ఫైజర్‌ అనుమతి కోరింది. డీసీజీఐ జూన్‌ మొదటివారంలో ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. అమెరికా, కెనడా, డెన్మార్క్‌, నార్వే వంటి విదేశాల్లో 50 కోట్లకు పైగా కొవిషీల్డ్‌ డోసులు నిరుపయోగంగా ఉన్నాయి. మిగులు టీకాలు ఉన్న దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదించి తెప్పించి మన వద్ద వేగంగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలి.

కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో?

టీకాల కోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. 100 శాతం జనాభాకు టీకాలకు 272 కోట్ల డోసులు అవసరం. ఒక్కో డోసును రూ.150కు కొనుగోలు చేస్తామని చెప్పింది. ఈ మేరకు కేంద్రం నిధులను ఉపయోగించాల్సి ఉన్నా అది జరగలేదు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదు.

తెలంగాణ విధానం అనుసరణీయం

తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్నవారిని గుర్తించి టీకాలు వేసే విధానాన్ని ప్రారంభించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తే సత్ఫలితాలు వస్తాయి. ప్రజలకు 2 డోసుల టీకాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనసాగిస్తున్నాం. ఇప్పటికే 13 లక్షల మందికి రెండో డోసు పూర్తయింది. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి టీకాలు అందించాం.

రాష్ట్రంలో వృథా అతి తక్కువ

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టీకాల వృథా తెలంగాణలో ఇప్పుడు అతి తక్కువగా ఉంది. పిల్లల్లో కరోనా నిరోధించేందుకు టీకా ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్‌ భారత్‌లో దీనిని నిర్వహిస్తోంది. విదేశాల్లోనూ పలు కంపెనీలు పిల్లలపై ప్రయోగాలు ప్రారంభించాయి’’ అని కేటీఆర్‌ తెలిపారు. టీకా వేయించుకున్నారా అన్న ఓ నెటిజన్‌ ప్రశ్నకు ఇంకా వేయించుకోలేదని సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి: Covaxin: పిల్లలపై క్లినికల్​ ట్రయల్స్​ షురూ

Last Updated : Jun 7, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details