తెలంగాణ

telangana

ETV Bharat / city

'3 రోజులు భాజపా నేతల సర్కస్​.. బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్​ తాగి జంప్​..' - trs joining

KTR Comments on BJP: తెలంగాణ భవన్​లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, భాజపా నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై, భాజపా నాయకులపై కేటీఆర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Minister KTR Comments on BJP central leaders
Minister KTR Comments on BJP central leaders

By

Published : Jun 30, 2022, 8:16 PM IST

'3 రోజులు భాజపా నేతల సర్కస్​.. బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్​ తాగి జంప్​..'

KTR Comments on BJP: రాష్ట్రంలో భాజపా సర్కస్ జరగబోతోందని.. రానున్న మూడు రోజులు ఇక్కడే దుకాణం పెడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఏదో చేస్తామంటూ వస్తున్న భాజపా కేంద్ర నాయకులు... హైదరాబాద్ బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్ తాగి వెళ్తారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు టూరిస్టుల్లా వచ్చి లొల్లి పెట్టి వెళతారని.. వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. భాజపా నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

భాజపా నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్​ను, తెరాసను దూషిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెరాస ఓపికను అమసర్థతగా భావించవద్దని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతామని వస్తున్న భాజపా జాతీయ నేతలకు.. రాష్ట్ర ప్రజలు తెలంగాణ అభివృద్ధి అంటే ఏమిటో చూపాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లు, ఇంటింటి నల్లాలు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, కల్యాణ లక్ష్మి పథకాలను భాజపా నేతలకు ప్రజలు చూపాలన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో నిలదీయాలని సూచించారు.

"దేశంలో నిజమైన దొర నరేంద్ర మోదీ మాత్రమే. ఎనిమిదేళ్లలో ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసి ఆదీనంలోకి తెచ్చుకున్న దొర నరేంద్రమోదీనే. కేంద్రంలోని భాజపా.. తెలంగాణ సొమ్ముతో కులుకుతూ మొండి చేయి చూపుతోంది. భాజపా నేతలు సైలెంట్​గా వచ్చి తెలంగాణ ప్రజలకు సెల్యూట్ కొట్టి వెళ్లాలి. కేసీఆర్​పై ప్రజల్లో ఆదరణ చూసి కాంగ్రెస్, భాజపా ఓర్వలేక పోతున్నాయి. 8ఏళ్ల కేసీఆర్‌, మోదీ పరిపాలనను బేరీజు వేయండి. 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం కల్వకుర్తికి ఏ మేలైనా చేసిందా?. సిలిండర్‌ ధర రూ.400 ఉన్నప్పుడే నాడు భాజపా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు సిలిండర్‌ ధర వెయ్యి రుపాయలు దాటింది. డాలర్‌తో పొలిస్తే రూపాయి మారకం విలువ 79కి పెరిగింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందరికి ఇచ్చారో మోదీ చెప్పాలి. కాంగ్రెస్​వి నీతి లేని మాటలు. యాభై ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిన కాంగ్రెస్... ఇప్పుడు ఒక్క చాన్స్ అనడానికి సిగ్గు పడాలి."- కేటీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

తెలంగాణ భవన్​లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, భాజపా నాయకులు కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. కల్వకుర్తిలో 38వేల ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details