KTR On Protests: తెలంగాణలో అన్నదాతల ఉసురుపోసుకుంటున్న కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి రాష్ట్ర తడాఖా చూపించాలని.. గల్లీ నుంచి దిల్లీ దాకా నిరసనలు దద్దరిల్లాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి ఈ సెగలు తగిలేలా పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చే దాకా పెద్దఎత్తున కార్యాచరణ ఉంటుందని.. ఇందులో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలన్నారు. అన్నదాతల ఆగ్రహాన్ని ఉద్యమరూపంలో వెల్లడించేందుకు కృషి చేయాలని చెప్పారు.
పంజాబ్ తరహాలో తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం తెరాస చేపట్టిన అయిదంచెల ఆందోళన కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు కేటీఆర్ తన నివాసం నుంచి ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత నవంబరు నుంచి ధాన్యం సేకరణ సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చినా.. ఏ మాత్రం స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పూర్తిగా అన్నదాతలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, బ్యాంకులను ముంచిన వారికి రూ.వేల కోట్ల లాభం కలిగిస్తూ రైతున్నల కోసం కొద్ది మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తోంది. రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలన్నింటినీ కేంద్రం అటకెక్కిస్తోంది. ఇప్పుడు రాజకీయ కారణాలతో రైతులకు అన్యాయం చేయాలనే భాజపా వైఖరిని ఎండగట్టేందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నాం.