అర్హులైన ప్రతిఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని... ఎవరూ ఆందోళన చెందొద్దని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల తక్షణ ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ రోజు పలు ప్రాంతాల నుంచి తమకు ఇంకా ఆర్థిక సాయం అందలేదని కొంతమంది చేసిన విజ్ఞప్తిలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ ఆర్థిక సాయం అందించినట్టు స్పష్టం చేశారు.
బాధితులందరికీ తక్షణ సాయం అందిస్తాం: కేటీఆర్
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తక్షణ సాయం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ పరిహారం అందే వరకూ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి విశాల దృక్పథంతో వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమన్నారు. ఇప్పటికీ అర్హులు ఎవరికైనా ఆర్థిక సాయం అందకుంటే... మరికొద్ది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ.. హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో తక్షణ ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై ఆదివారం సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఇదీ చూడండి:రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్