KTR Meet Aditya Mittal: రాష్ట్రంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రసిద్ధ ఉక్కు కంపెనీ అర్సెలార్ మిత్తల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కర్మాగారం ఏర్పాటుకు బయ్యారం అత్యంత అనుకూలమైందని, విస్తృతమైన ఇనుప ఖనిజ నిల్వలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు.
KTR Meet Aditya Mittal: 'బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టండి'
KTR Meet Aditya Mittal: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో అర్సెలార్ మిత్తల్ సీఈవో ఆదిత్య మిత్తల్ భేటీ అయ్యారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అర్సెలార్ మిత్తల్ సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈవో) ఆదిత్య మిత్తల్ బుధవారం కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ గురించి చర్చించారు. తెలంగాణలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పనతో పాటు వనరుల సద్వినియోగం, ఉక్కు ఉత్పత్తి, ఎగుమతుల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉక్కు కర్మాగార ఏర్పాటుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఏపీ విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మాట నిలబెట్టుకోలేదన్నారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమను స్థాపించేందుకు మిత్తల్ సంస్థ ముందుకు రావాలని ఆయన కోరారు. భూకేటాయింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని, మెగా పరిశ్రమ హోదా కింద ఎక్కడా లేని విధంగా రాయితీలు ఇస్తామన్నారు. బయ్యారం జాతీయరహదారికి సమీపంలో ఉందని, వరంగల్ జిల్లాలోని మామునూరు వద్ద విమానాశ్రయాన్ని పునరుద్ధరించే సన్నాహాల్లో ఉన్నామని, కొత్తగూడెం వద్ద కొత్త విమానాశ్రయ ప్రతిపాదన చేశామన్నారు. హైదరాబాద్ అల్లుడైన ఆదిత్య మిత్తల్ రాష్ట్రానికి మేలు చేసేందుకు చొరవ చూపాలని కేటీఆర్ కోరారు. మిత్తల్ దీనిపై స్పందిస్తూ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని, త్వరలోనే తమ బృందాన్ని తెలంగాణకు పంపుతామని చెప్పారు.
ఇదీచూడండి:american industrial park: రాష్ట్రంలో అమెరికన్ పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కు