Mana Ooru Mana Badi: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గదర్శనం, నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో తనదైన మార్కు చాటుతూ అభివృద్ధి సాధిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కేటీఆర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7289 కోట్లతో.. దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా.. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
పాఠశాలలకు దాతలు సూచించిన పేర్లు..
ప్రభుత్వం చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అందరూ ముందుకు రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే కోటి రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే వారు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడతామన్నారు. పది లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే ఆయా తగరతి గదికి వారు సూచించిన పేరు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుందన్నారు. దీంతో పాటు తమకు తోచినంత మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుకు వచ్చే వారందరి నుంచి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించిన తర్వాత విరాళాలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు.