Thermo Fisher Scientific Lab in Hyderabad : ప్రపంచ స్థాయి సంస్థల పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఏటా 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆర్ అండ్ డీ సెంటర్ 450 మంది ఇంజినీర్లకు ఉపాధి కల్పించబోతోందని ప్రకటించారు. లైఫ్‌సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసేలా ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
Thermo Fisher Scientific Research Lab : "థర్మో ఫిషర్ తమ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం సంతోషకరం. ఇది ఇన్నోవేషన్, రీసెర్చ్ రంగాల్లో హైదరాబాద్ ఘనతను మరింత చాటుతుంది. సాంకేతిక కేంద్రంగా ప్రపంచంలో హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. లైఫ్ సైన్సెస్ రంగానికి గమ్యస్థానంగా, నైపుణ్య హబ్‌గా హైదరాబాద్ పేరు గడిస్తోంది. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, ఐఐసీటీ వంటి ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ చేసిన అధ్యయనం ప్రకారం.. లైఫ్‌సైన్సెస్ పరిశోధనా రంగంలో ప్రపంచంలోని ఇతర క్లస్టర్లకన్నా హైదరాబాద్ ముందుంది. ఈ పురోగతిని కొనసాగించేలా జీనోమ్ వ్యాలీ వంటి క్లస్టర్ల ఏర్పాటుతో మేం ముందుకు వెళ్తున్నాం."
కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి