Minister KTR Programme: సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సుభిక్షంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాడు ఉద్యమ నేతగా.. నేడు అభివృద్ధి ప్రదాతగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పూడుర్ గ్రామంలో ఫుడ్‌ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి కృషి వల్ల ఈ వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పూడూరులో 5 కోట్లతో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
గిఫ్ట్ ఏ స్మైల్‌లో 265 స్కూటీల పంపిణీ..
అనంతరం బహదూర్‌పల్లిలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 265 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 50, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ 50, ఎమ్మెల్సీ రాజు 50 వాహనాలు ఇవ్వగా.. మిగతా 116 మంత్రి కేటీఆర్ సొంత ఖర్చుతో పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుల కుటుంబానికి డబుల్ బెడ్ రూం అందజేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 3116 రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 960 వాహనాలను దివ్యాంగులకు అందజేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.