విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనల మేరకు తరగతి గదులను శానిటైజ్ చేయించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి యూనిఫామ్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
'పాఠశాలలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయండి' - సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల ప్రారంభంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాల్సిందిగా అధికారులను కోరారు.
గురుకులాలు, హాస్టళ్లల్లో విద్యార్థులకు వేడివేడి ఆహారం అందేలా చూడాలని మంత్రి సూచించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది నూటికి నూరు శాతం హాజరయ్యేలా చూసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. విద్యాసంస్థల ప్రారంభంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాల్సిందిగా ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లా,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.