తెలంగాణ

telangana

ETV Bharat / city

'భాజపా చెబితేనో.. బండి సంజయ్ చెబితేనో.. మొదలుపెట్టిన పథకం కాదు దళితబంధు' - మంత్రి కొప్పుల ఈశ్వర్

భాజపా నేతలపై మంత్రి కొప్పుల ఈశ్వర్​ మండిపడ్డారు. దళితులను హేళన చేసిన నాయకులను పార్టీలో పెట్టుకుని వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబడ్డారు. దళితబంధు పథకం గురించి మాట్లాడేందుకు బండి సంజయ్​కి ఎలాంటి అర్హత లేదని మండిపడ్డారు.

minister koppula Eshwar about dalithabandhu
minister koppula Eshwar about dalithabandhu

By

Published : Nov 5, 2021, 9:10 PM IST

దళితబంధును వెంటనే అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. దళితబంధుపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేయటం వల్లే అమలు ఆగిపోయందని మంత్రి స్పష్టం చేశారు. భాజపా చెబితేనో.. బండి సంజయ్ చెబితేనో.. మొదలు పెట్టిన పథకం.. దళిత బంధు కాదన్నారు. దళిత బంధుపై మాట్లాడటానికి బండి సంజయ్​కు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.

భాజపా చెబితేనో.. బండి సంజయ్ చెబితేనో.. మొదలుపెట్టిన పథకం కాదు దళితబంధు

"బండి సంజయ్​కు దమ్ముంటే భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితబంధు లాంటి పథకం పెట్టించాలి. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలి. హుజూరాబాద్​లో ఎక్కడా లేని విధంగా భాజపా ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ముందు ఆ మేనిఫెస్టోను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని భాజపా ఎంపీ అరవింద్.. లొట్టపీసు చట్టం అంటూ హేళన చేశారు. దళిత జాతిని అవమాన పరిచిన ఎంపీని భాజపాలో ఉంచుకుని.. వారి సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరం. మా ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. కాంగ్రెస్, భాజపాలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజూరాబాద్​లో గెలిచారు. కాంగ్రెస్​తో అనైతిక పొత్తు పెట్టుకుని గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ ఫలితం చిచ్చు రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఈటలతో కుమ్మక్కుకావడాన్ని కాంగ్రెస్ సీనియర్లే తప్పు పడుతున్నారు. కాంగ్రెస్, భాజపాల నీతి బాహ్యపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు." -కొప్పుల ఈశ్వర్, మంత్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details