kodali nani: వంగవీటి రాధాకు 2ప్లస్2 గన్‌మెన్లు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మంత్రి కొడాలి నాని కలిశారు. వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రాధాకు భద్రత కల్పించాలని, రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం ఆదేశించారని కొడాలి నాని పేర్కొన్నారు. వైకాపాలోకి వస్తానని రాధా చెప్పలేదని.. తాము రమ్మనలేదని స్పష్టం చేశారు. రాధా వైకాపాలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతామన్నారు. రాధా పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లామని.. అంతకంటే మరేం లేదంటూ నిన్నటి పర్యటన గురించి వ్యాఖ్యానించారు.
"రాధాకు 2ప్లస్2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. వైకాపాలోకి వస్తానని రాధా చెప్పలేదు.. మేమూ రమ్మనలేదు. రాధా వైకాపాలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతాం. పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లాం.. అంతకంటే మరేం లేదు" - కొడాలి నాని, ఏపీ మంత్రి
అలాగైతే వారు బడ్డీకొట్టే పెట్టుకుంటారు కదా..?
kodali nani on Movie tickets issue: సినిమా టికెట్ల ధరలపై మాట్లాడుతూ.. గతంలో ఉన్న టికెట్ ధరలే ఇప్పుడున్నాయని.. తాము ఎక్కడా తగ్గించలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టికెట్ ధర పెంచి దోచుకునేందుకు అవకాశం కల్పించలేదన్నారు. కమిటీ వేసి టికెట్ ధర పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎగ్జిబిటర్లకు ఎలాంటి నష్టమూ లేదని పేర్కొన్నారు. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. బడ్డీ కొట్టు ఆదాయం కూడా థియేటర్ యజమానికి రాదంటున్నారని.. అలాగైతే థియేటర్ యజమానులు బడ్డీకొట్టే పెట్టుకుంటారు కదా? అంటూ వ్యాఖ్యానించారు.