విద్యుత్ సిబ్బందిపై పోలీసులు దాడులకు పాల్పడడాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందని.. వారి సేవలకు ఆటంకం కల్పించొద్దని మంత్రి సూచించారు. రాత్రి పగలు అనక పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడులు చేసిన వారిని గుర్తించాలని... మంత్రి ఆదేశించారు.
'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు' - lotty charge on electrical employees
విద్యుత్ సిబ్బందిపై పోలీసులు లాఠీలు ఝళిపించటంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సిబ్బందిపై దాడులు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని... అదే సమయంలో చట్టబద్దంగా వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు చూడకుండా లాఠీలకు పని చెప్పొద్దని మంత్రి హితవు పలికారు. నల్గొండలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీతోనూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. కరోనా చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రులకు, వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు.
విద్యుత్ శాఖ సిబ్బందిని, అధికారులను ఆపవద్దని... వాహనాలను సీజ్ చేయవద్దని పోలీసు అధికారులకు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలో, హైదరాబాద్లో విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ ఐడీ కార్డ్, సంబంధిత పాస్ చూపిస్తే వదిలేయాలని ప్రభాకర్ రావు సూచించారు. విద్యుత్ శాఖ సిబ్బందికి, అధికారులకు లాక్డౌన్ మినహాయింపు ఉందని పోలీస్ శాఖకు గుర్తు చేశారు.