ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రి హైదరాబాద్ అరణ్యభవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని... భూసేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు తదితరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి చెప్పారు.
చెక్ డ్యాంల నిర్మాణ పనులను కూడా పూర్తి చేసి చెరువులను నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. చనకా-కొరాట, కుమురం భీం, జగన్నాథపూర్, నీల్వాయి ప్రాజెక్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్‌లోగా 93 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ సర్వే చేపట్టి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.