వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆధునిక జీవన విధానంలో బియ్యం, గోధుమలపై ఆధారపడటం వల్ల జీవన శైలి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరగుతున్న నూట్రీ - సెరెల్స్ కాన్‌క్లేవ్: 2019 ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తులకు సంబంధించి 22 అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. బహుళ పోషకాలు, అదనపు విలువ జోడింపు, ఆహారోత్పత్తుల తయారీ అంశాలు పరిశీలించి అంకుర సంస్థల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
సేంద్రియ వ్యవసాయం, యోగా, ఆహార అలవాట్లు, అభిరుచులు పూర్తిగా మారిపోతున్న దృష్ట్యా... చిరుధాన్యాల పంటల ఉత్పత్తులు అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పథకంలో కూడా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. చిరుధాన్యాల పంటల ఉత్పత్తుల ఆహారం వినియోగం పెంపొందించేందుకు సిద్దిపేటలో కూడా చిరుధాన్యాల స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.