Harishrao on Telangana National Unity Vajrotsavam: ప్రజల మధ్య కులమతాల చిచ్చుతో రాజకీయ లబ్ధికి కొందరు యత్నిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ గడ్డ ఎప్పటికప్పుడు పెత్తందారులను తిప్పి కొట్టిందని పేర్కొన్నారు. అలాంటి గడ్డపై మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సిద్దిపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
సంపదలు పెంచు.. ప్రజలకు పంచు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదమని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటోందని హరీశ్‌రావు తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 8 ఏళ్లలో దక్షిణ భారత ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు.
'ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా సాగుతున్నాం. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా మార్చాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంటపొలాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట మెడ్ ఎక్స్‌పోను విద్యార్థులు సందర్శించాలి. రెండ్రోజులపాటు సిద్దిపేట మెడ్ ఎక్స్‌పో ఉంటుంది.'- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి