Harish Rao on Niti Aayog rank: నీతి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. 2018-19లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆరోగ్య రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
ఆరోగ్య తెలంగాణ సాకారం
Telangana third in Niti aayog ranks: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నారని హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న ప్రశంసలే నిదర్శనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.