తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్‌ - హరీశ్ రావు వార్తలు

కేంద్రం జీఎస్టీ చట్టం ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉండగా చేతులెత్తేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. జీఎస్టీ పరిహారంపై కేంద్రం చేసిన రెండు ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం 14 శాతం వృద్ధిరేటు మేరకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. హరీశ్‌ రావుతోపాటు ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.

harish rao
harish rao

By

Published : Sep 1, 2020, 6:41 AM IST

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంపై కేంద్రం చేసిన రెండు ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. జీఎస్టీ చట్టం ప్రకారం రూ.3 లక్షల కోట్ల పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే రుణంగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని స్పష్టం చేశారు.

పరిహారం చెల్లింపులో కేంద్రం వైఖరిని పార్లమెంటులో నిలదీస్తామన్నారు. రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన పరిహారంపై అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. కేంద్రమే జీఎస్టీ చట్టం ఉల్లంఘనకు పాల్పడుతోందని.. పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉండగా చేతులెత్తేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. చట్ట ప్రకారం 14 శాతం వృద్ధిరేటు మేరకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.

పోరాడుతాం

కేంద్రం ప్రతిపాదనలపై హరీశ్‌రావు అయిదు భాజపాయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు కేరళ, పంజాబ్‌, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనల్ని తిరస్కరించాలని నిర్ణయించాయి.

కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్‌ చేశారు. జీఎస్టీ పరిహారంపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కుల్ని కాలరాసేలా జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించేలా కేంద్ర వ్యవహరిస్తోందని.. దీనిపై పోరాడాలనే అభిప్రాయానికి వచ్చాయి.

పార్లమెంట్‌లో నిలదీస్తాం

ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. పూర్తి పరిహారం పొందడమే అందరి నినాదంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో గట్టిగా నిలదీయడంతో పాటు అవసరమైతే కలసికట్టుగా న్యాయపోరాటానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. పరిహారాన్ని చెల్లించే బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలకు హక్కులు సమానంగా ఉండాలన్నారు. కాగా, కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌ రాష్ట్రంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సైతం కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకించాయి.

రాష్ట్రాల హక్కులు కాలరాయొద్దు

రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనాతో రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని.. తెలంగాణ నాలుగు నెలల్లో సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం రూ.3647 కోట్ల కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో చేరే అంశంపై సందేహించినా.. పార్లమెంటుకు చట్టబద్ధత ఉందని, రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇవ్వడంతోనే చేరామన్నారు.

పరిహారంగా రూ.3200కోట్లు

జీఎస్టీలో చేరేనాటికి రాష్ట్రం 22 శాతం వృద్ధిరేటుతో ఉందన్నారు. జీఎస్టీలో చేరకుండా ఉండి ఉంటే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల రాబడి వచ్చేదన్నారు. రాష్ట్రం నుంచి సెస్సు రూపంలో కేంద్రానికి రూ.18,032 కోట్లు వెళ్లగా.. రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా వచ్చింది రూ.3,200 కోట్లు మాత్రమే అన్నారు. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మూడు శాతంగా నిర్దేశించి కేంద్రం మాత్రం ఐదు శాతం రుణాలను తీసుకుంటోందని.. అవసరమైనప్పుడు సవరణలు చేసుకుంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం 16 శాతం సెస్సు, సర్‌ఛార్జీలతో లక్ష కోట్ల ఆదాయాన్ని పొందిందన్నారు.

నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్‌ లేఖ

జీఎస్టీ పరిహారం చెల్లింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా దేశం అభివృద్ధి చెందినట్లే అని నీతి ఆయోగ్‌ సమావేశంలో కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారన్నారు.

చట్ట ప్రకారం 14 శాతం వృద్ధిరేటుతో పరిహారం చెల్లించాల్సి ఉండగా.. 10 శాతానికి తగ్గించే అధికారం కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. సెస్సు రాకపోయినా పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుందని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఏడో, ఎనిమిదో జీఎస్టీ మండలి సమావేశంలో చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేంద్రం మాట నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణకు రూ.10 వేల కోట్లు పరిహారంగా వస్తుందన్నారు. దైవ నిర్ణయం (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) అని కేంద్రం అనడం సరికాదని.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులూ యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వల్ల రాబడి రాక పన్నులు చెల్లించలేమంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details