నూతన వేతన సవరణలో భాగంగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న వారికి అవకాశమివ్వాలన్న గోపాలమిత్రల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గోపాలమిత్రల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ అరణ్య భవనంలో రాష్ట్ర గోపాలమిత్రుల సంఘం అధ్యక్షుడు చెరకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చక్రపాణి నేతృత్వంలో పలువురు గోపాలమిత్రలు మంత్రి హరీశ్ రావును కలిశారు. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
జిల్లా పశువైద్యాధికారి నుంచి ప్రతినెల వేతనాలు ఇప్పించాలని మంత్రికి గోపాలమిత్రలు విన్నవించారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో విడుదల చేయనున్న నోటిఫికేషన్లలో గోపాలమిత్రులకు వెటర్నరీ అసిస్టెంట్లుగా 50 శాతం వెయిటేజ్ ఇవ్వడమే గాక సీనియర్ గోపాలమిత్రలకు పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌లుగా అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన గోపాలమిత్రుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.
తమ సమస్యలపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారని చెరకు శ్రీనివాస్ తెలిపారు.