ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం మాడ్యూల్స్ రూపొందించడం సహా వాటిపై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (Dharani news) బీఆర్కే భవన్లో ఇవాళ భేటీ అయింది. మంత్రులు సబిత, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.
మైలురాయిగా ధరణి పోర్టల్..
ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించేందుకు మాడ్యూల్స్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులుపై సమావేశంలో చర్చించారు. భూ రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందన్న హరీశ్‌రావు.. ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగాయన్నారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై 98,049 దరఖాస్తులు రాగా.. వాటిలో 82,472 దరఖాస్తులను పరిష్కరించినట్లు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు ధరణి పోర్టల్‌ను మరింత పరిపుష్ఠం చేసేలా పొందుపర్చాల్సిన ఐచ్చికాలపై సమావేశంలో చర్చించారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు.