రాష్ట్రంలో పెరుగుతున్న దిగుబడులకు అనుగుణంగా రాబోయే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రైస్ మిల్లర్లు, ఛౌక ధరల దుకాణాల డీలర్ల సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'సాగువిస్తీర్ణంలో దేశంలో మనమే మొదటి స్థానం' - paddy procurement updates
హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాభవన్‌లో రాష్ట్ర స్థాయి రైస్ మిల్లర్లు, ఛౌక ధరల దుకాణాల డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలంలో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతుబంధు వంటి పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలంలో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. తాజాగా వానా కాలంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
దాదాపు 10 కోట్లు కొత్తవి, 9 కోట్లు పాత గన్నీ సంచులు అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కోల్‌కతా నుంచి అవసరమైన మేరకు కొత్త గన్నీ సంచులు వచ్చే అవకాశం లేని దృష్ట్యా... పాత గన్నీ బ్యాగుల అవసరం అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.