తెలంగాణ

telangana

ETV Bharat / city

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలిగించొద్దు: మంత్రి గంగుల - బియ్యం సేకరణపై మంత్రి గంగుల సమీక్ష

Review on paddy Procurement Centres: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరుసగా ప్రారంభం అవుతున్న దృష్ట్యా అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ సమయంలో అనవసర అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై నోడల్‌ అధికారులను నియమిస్తామని వెల్లడించారు.

paddy purchasing centres
ధాన్యం కొనుగోలు కేంద్రాలు

By

Published : Apr 17, 2022, 9:11 AM IST

Review on paddy Procurement Centres: నాణ్యత ప్రమాణాల మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. సేకరణ సమయంలో అనవసర అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. బియ్యం సేకరణ గడువు విషయంలో కేంద్రంతో సంప్రదించాలని, ఎక్కువ బియ్యం ఇచ్చే వారికీ ఇతరులతో సమానంగా గడువు ఇవ్వటం సబబుకాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రారంభించిన నేపథ్యంలో శనివారం ఆయన ఎఫ్‌సీఐ, రాష్ట్ర అధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

‘‘రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో యాసంగి ధాన్యంలో నూకలు ఎక్కువగా వస్తాయి. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సేకరణ సాఫీగా సాగేలా చూడాలి. బియ్యం తరలింపునకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో పాటు గోదాముల్లో అదనపు సదుపాయాలు కల్పించాలి. బియ్యం తీసుకునేందుకు అదనపు గడువు నెల మాత్రమే ఇస్తున్నారు. దీన్ని పెంచేందుకు కేంద్రాన్ని ఒప్పించాలి. గత యాసంగికి రాష్ట్రం ఇవ్వాల్సిన 5.25 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యంగా కేంద్రం తీసుకోవాలి. ప్రస్తుత యాసంగి ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల శాఖ నుంచి జనరల్‌ మేనేజర్‌ రాజిరెడ్డి, ఎఫ్‌సీఐ నుంచి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కమలాకర్‌ను నోడల్‌ అధికారులుగా నియమిస్తాం’’ అని మంత్రి తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష:యాసంగి బియ్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎఫ్‌సీఐ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సాధారణ బియ్యంతోపాటు పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కూడా చర్చించినట్లు సమాచారం.

ఎఫ్‌సీఐకి రాసిన లేఖలో పేర్కొన్న తెలంగాణ:‘యాసంగిలో 40.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తాయని ఎఫ్‌సీఐకి రాసిన లేఖలో తెలంగాణ పేర్కొంది. ధాన్యం కొనుగోలుకు 6,968 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది ప్రాథమిక అంచనాగా పేర్కొంది. పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం అడిగినంత ఇవ్వగలమని తెలిపింది. సాధారణ బియ్యం కూడా ఎఫ్‌సీఐకి ఇస్తామంది. రాష్ట్రంలో 1,672 మిల్లుల గడిచిన సీజనులో ధాన్యం మిల్లింగ్‌ చేశాయని, వాటిల్లో 765 సాధారణ బియ్యం మిల్లులు కాగా ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌ చేసేవి 867 ఉన్నాయంది. నెలకు 1.78 లక్షల మె.ట. సాధారణ బియ్యం, 5.67 లక్షల మె.ట. ఉప్పుడు బియ్యం తయారీ సామర్థ్యం ఉందని చెప్పింది.

సుమారు 15కోట్ల గోనెసంచులు అవసరమన్నది అంచనా వేశామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి బియ్యం ఇచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం తెలిపింది. ధాన్యం కొనుగోలు కోసం రైతులకు టోకెన్లు ఇవ్వాలనుకుంటున్నామంది. ఒక్కసారిగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. కేంద్రం గతంలో జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రైతుల భూ వివరాలు, బ్యాంకు ఖాతాలను, ఆధార్‌తోనూ అనుసంధానం చేశామని, కొన్నేళ్లుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేస్తున్నామని ఆ లేఖలో తెలిపింది.

ఇవీ చదవండి:'కేంద్రం నిధులిస్తుంటే ఫొటోలు, పేర్లు మార్చి తెరాస ప్రజలను ఏమార్చుతోంది'

విద్యుత్​ కొనకుండా అడ్డుపుల్ల.. నేడు అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు అందేనా..!

ABOUT THE AUTHOR

...view details