తెలంగాణ

telangana

ETV Bharat / city

'గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి'

Errabelli on Pallepragathi: పల్లెప్రగతిని విజయవంతం చేసే బాధ్యతను జెడ్పీ ఛైర్మన్లు, C.E.Oలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఐదోవిడత పల్లెప్రగతి కార్యక్రమంపై... హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను... పల్లె ప్రగతి కార్యక్రమానికి, జెడ్పీ ఛైర్మన్లకు అనుసంధానించాలని ఎర్రబెల్లి ఆదేశించారు.

Errabelli
Errabelli

By

Published : May 27, 2022, 5:21 AM IST

Errabelli on Pallepragathi:రాష్ట్రంలో అయిదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామాల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. జడ్పీ ఛైర్‌పర్సన్లు, సీఈవోలు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను తీసుకుని గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, సర్పంచులు.. అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎజెండా ప్రకారం పనులు చేపట్టాలన్నారు. పల్లెప్రగతిలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, గ్రామాల్లో పల్లెప్రగతి కమిటీలు వేయాలని దిశానిర్దేశం చేశారు. గురువారం ఇక్కడ పంచాయతీ రాజ్‌ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ శరత్‌తో కలిసి జడ్పీ ఛైర్‌పర్సన్లు, సీఈవోలతో మంత్రి పల్లెప్రగతి సన్నాహక సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను పల్లెప్రగతి కార్యక్రమ పరిధిలోకి తీసుకురావాలన్నారు.

‘‘దేశంలో ప్రకటించిన 20 ఉత్తమ గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవే. పారిశుద్ధ్యం, ఈ-పంచాయతీ, ఆడిటింగ్‌, బహిరంగ విసర్జన రహిత గ్రామాల కేటగిరీలో మన గ్రామాలు అగ్రస్థానంలో ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల శ్రమతోనే ఇది సాధ్యమైంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. ఉపాధి హామీలోనూ దేశంలో నం.1గా కొనసాగుతున్నాం. కమిటీల ద్వారా పలు సమస్యలు గుర్తించి పరిష్కరించాలి. నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి పెట్టాలి’’ అని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్లు విఠల్‌రావు, నరేందర్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, పట్నం సునీత, స్వర్ణలత, గండ్ర జ్యోతి, అనితారెడ్డి, కొండ అరుణ, దపేదార్‌ శోభ, కనుమల్ల విజయ, వసంత, కోవా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:'తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు..'

ABOUT THE AUTHOR

...view details