ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 51 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో.. కొత్తగా 38 దహన వాటికలను నిర్మించబోతున్నట్లు ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేవన్నారు. పర్యావరణహితంగా, ఎల్పీజితో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి ఈ పనుల్లో భాగంగా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొవిడ్ పరిస్థితులు, సంప్రదాయబద్ధంగా కర్రలను ఉపయోగించి దహనం చేస్తోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... అంత్యక్రియల నిర్వహణకు పర్యావరణ హితమైన ఏర్పాట్లు ఉండేలా చూడాలన్న ఏపీ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల అంతిమ సంస్కారాల నిర్వహణలో దురదృష్టకరమైన అమానవీయ సంఘటనలు చోటు చోసుకోవడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు నిలువరించటానికి... పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో వసతుల కల్పన పనులను చేపడుతోందన్నారు.