Minister Botsa Satyanarayana: ఎన్నికల్లో ఎవరైనా వారసులను దింపవచ్చనీ... అందుకు ప్రజామోదం ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ వారసులు అందరికీ ఉంటారని, తనకూ తన కుమారుడు ఉన్నాడని వెల్లడించారు. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే పార్టీ పరంగా సీఎం ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటుపాట్లు చెప్పారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని... అదే సీఎం గట్టిగా చెప్పారని వివరించారు. 175స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదన్న బొత్స... ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో పదై కూర్చుంటుందని వ్యాఖ్యానించారు. శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై తనకు సమాచారం లేదన్నారు. తమ పార్టీ విషయాలు తాము మాట్లాడుకుంటామని... అవి మీడియాకు అనవసరమన్నారు.
"వారసులు అందరికీ ఉంటారు, నాకూ మా అబ్బాయి ఉన్నాడు. ఎవరైనా వారసులను దింపొచ్చు, కానీ ప్రజలు ఆమోదించాలి. 175 స్థానాలు గెలవాలనుకోవడం అత్యాశ కాదు. ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదనుకుంటే 10 అవుతుంది. శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై నాకు సమాచారం లేదు. శాఖాపరమైన సమీక్షల మాదిరే పార్టీ పరంగా లోటుపాట్లు చెప్పారు. ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపే, అదే సీఎం చెప్పారు."-మంత్రి బొత్స సత్యనారాయణ
ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల జాబితా విడుదల:విజయవాడలో ఆర్జీయుకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల జాబితాను మంత్రి బొత్స స్యతనారాయణ విడుదల చేశారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ ఫలితాలు వెల్లడించారు. ఈ సంవత్సరం 77 శాతం ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి ప్రవేశాలు వచ్చాయని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీరెడ్డి తెలిపారు. వీరిలో 67శాతం అమ్మాయిలు ఉన్నారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు ప్రకటించారు. ప్రకాశం జిల్లా సింగరయ కొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని మయూరికి ప్రథమ ర్యాంకు రాగా, 2వ ర్యాంకు శ్రీకాకుళం టెక్కలి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన చక్రపాణి బెహరా, 3వ ర్యాంకు గుంటూరు జిల్లా మన్నంగి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సోమిసెట్టి ఫణింద్ర రామకృష్ణకు వచ్చినట్లు వెల్లడించారు.