MINISTER BOTSA COMMENTS ON THREE CAPITALS IN AP: మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమన్నారు. తమ విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తామని తెలిపారు. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. రాజధాని అంటే కేవలం భూమి, అక్కడి సామాజిక వర్గమే కాదని అన్నారు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలని బొత్స వెల్లడించారు.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని బొత్స స్పష్టం చేశారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంటుకు విరుద్ధంగా ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చిందని.., దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. సీఆర్‌డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. నిధులు, సమయం పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని తాము చెప్పట్లేదన్నారు. రాజధానిపై 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఒక్క సామాజిక వర్గం కోరిక మేరకు రాజధాని ఉండదన్నారు. రైతులకు కావల్సిన రెండు అంశాలు నెరవేరుస్తామన్నారు.
రాజధాని భూములను ప్రభుత్వం ఎక్కడా తనఖా పెట్టలేదని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి అభివృద్ధి కోసమే అక్కడి భూములను హడ్కోకు తాకట్టు పెట్టామన్నారు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారని మీడియాతో అన్నారు.
"మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. అధికార వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తాం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చిస్తాం. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా?. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉంది. పార్లమెంటుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది, దీనిపై విస్తృత చర్చ జరగాలి. సీఆర్‌డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని మేం చెప్పట్లేదు. రాజధానిపై 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాం. ఒక్క సామాజిక వర్గం కోరిక మేరకు రాజధాని ఉండదు.రాజధాని భూములను మేం ఎక్కడా తనఖా పెట్టలేదు. అమరావతి అభివృద్ధి కోసమే అక్కడి భూములను హడ్కోకు తాకట్టు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారు." -బొత్స సత్యనారాయణ, మంత్రి