ఒకే పడకపై ఇద్దరిని పడుకోబెట్టి కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైనం చూసి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అవాక్కయ్యారు. అదనపు పడకలను సిద్ధం చేయాలని, ఒకే మంచంపై ఇద్దరిని పడుకోబెట్టడం ఏంటంటూ వైద్యాధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో అతిసారం బారిన పడి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడంతో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి ఆదోని, గోరుకల్లులో ఆయన పర్యటించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
నీటి నమూనాలను తీసి విజయవాడ పరీక్ష కేంద్రానికి పంపాలని వైద్యాధికారులకు సూచించారు. ఆదోనిలో అతిసారం ప్రబలడానికి కారణాలేంటి? ఏం జరిగిందంటూ అధికారులను ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో నేరుగా అతిసారం ప్రబలిన అరుణజ్యోతి నగర్‌లో ఆయన పర్యటించి స్థానికులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. కలుషిత నీరు సరఫరా కావడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కాలనీ మహిళలు, వృద్ధులు మంత్రి దృష్టికి తెచ్చారు. అతిసారంతో మృతి చెందిన రంగమ్మ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున బాధితులకు రూ.3 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.