Minister Suresh On SSC Exams:మార్చిలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ కేజీబీవీ, గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు 7 సబ్జెక్టులతో నిర్వహిస్తామన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి హోదాలో మొదటిసారి వినుకొండ పర్యటనకు వచ్చిన సురేశ్.. తొలుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. యూనిఫామ్ కొరత ఉందని తెలుసుకున్న మంత్రి.. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే యూనిఫాం సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు.