తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2022, 7:18 AM IST

ETV Bharat / city

గిట్టుబాటు లేనప్పుడు.. ఏ పంటైనా ఏం లాభం?

MSP for Crops : సాగు ఖర్చులేమో ఆకాశాన్నంటుతున్నాయి. కానీ పంటల మద్దతు ధర మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఏ మార్పు లేకుండా ఉన్నాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్, రవాణా.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల పంట పెట్టుబడి వ్యయం కూడా బాగా పెరిగింది. కానీ పంటలకు కనీస మద్దతు ధర మాత్రం కేంద్ర సర్కార్ అంతంత మాత్రమే పెంచింది. కొన్ని పంటలకైతే ప్రభుత్వం పెంచిన మద్దతు ధరకు కొన్నా నష్టాలే రైతులకు నష్టాలే మిగులుతాయి.

MSP for Crops
MSP for Crops

పంటల సాగు ఖర్చులు ఆకాశాన్నంటుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అంతంతమాత్రంగా పెంచిన కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)తో రైతులకు నిరాశే మిగలనుంది. విత్తనాలు, ఎరువులు, డీజిల్‌, రవాణా ఖర్చులన్నీ గత ఏడాది కాలంలోనే 20 నుంచి 30 శాతం పెరిగాయి. ఇవన్నీ లెక్కిస్తే పంట పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ అధ్యయనంలో గుర్తించి మద్దతు ధరలు పెంచాలని కేంద్రాన్ని కోరింది. అయినా గతేడాదికన్నా అరకొరగా పెంచడంతో పంటలపై రైతులకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని పంటల పెట్టుబడి ఖర్చులన్నీ లెక్కిస్తే మద్దతు ధరకు ప్రభుత్వం కొన్నా నికరంగా చివరికి నష్టాలే మిగులుతాయని అర్థమవుతోంది.

ఉదాహరణకు తెలంగాణలో వరి ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటా పండించాలంటే రైతు పెట్టాల్సిన పెట్టుబడి సగటున రూ.3,054 అని వ్యవసాయశాఖ లెక్కలే వివరిస్తున్నాయి. కానీ ఈ వానాకాలంలో సాగుచేసే వరి ధాన్యం ఏ గ్రేడ్‌కైతే రూ.2,060, సాధారణ రకానికైతే రూ.2,040 ఇవ్వాలని కేంద్రం తాజాగా మద్దతు ధరలు నిర్ణయించింది. అంటే క్వింటా ఏ గ్రేడ్‌ ధాన్యం పండించి ప్రభుత్వానికే మద్దతు ధరకు అమ్ముకున్నా రూ.994 చొప్పున నికరంగా నష్టం వస్తుంది.

వ్యాపారులు పెంచితేనే తెల్ల‘బంగారం’

రాష్ట్రంలో ఈ వానాకాలంలో ప్రధాన పంటగా పత్తినే అధికంగా సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. పత్తి సాగు ఖర్చులు, కొత్త మద్దతు ధరలను పరిశీలిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందా అనేది ప్రశ్నార్థకమే. గతేడాది పత్తి దిగుబడులు తగ్గడంతో వ్యాపారులు మద్దతు ధరతో సంబంధం లేకుండా పెంచేసి రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.14 వేల దాకా చెల్లించి ఇటీవల దూది కొన్నారు. పత్తి పంటకు గతేడాది(2021-22) మద్దతు ధర రూ.6,025 కాగా ఈ ఏడాది రూ.6,380కి పెంచినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. క్వింటాకు అదనంగా రూ.355 చొప్పున పెంచామని తెలిపింది. కానీ తెలంగాణలో క్వింటా పత్తి పండించాలంటే సగటున రూ.11,376 దాకా రైతు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ లెక్కన క్వింటాకు మద్దతు ధర రూ.6,380 ఇచ్చినా నికరంగా రూ.4,996 చొప్పున రైతుకు నికరంగా నష్టమే మిగులుతుంది.

పొద్దుతిరుగుడుకే రూ.1974 లాభం

పత్తితో పాటు కంది, ఇతర పప్పుధాన్యాలు, నూనెగింజలు అధికంగా సాగుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది. కొత్త మద్దతు ధరలను పరిశీలిస్తే అన్నింటిలోకెల్లా పొద్దుతిరుగుడు ఒక్కటే పెట్టుబడి వ్యయం క్వింటాకు రూ.4,426 దానికన్నా ఎక్కువగా మద్దతు ధర క్వింటాకు రూ.6,400 ఇవ్వాలని కేంద్రం ప్రకటించడం రైతులకు ఊరటనిచ్చే అంశం. దేశంలో వంటనూనెలకు తీవ్రంగా కొరత ఉన్నందున రైతులు పొద్దుతిరుగుడు పంట సాగుచేస్తే లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త మద్దతు ధరలు వచ్చే అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

ABOUT THE AUTHOR

...view details