తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రశాంతంగా ముగిసిన మినీ పురపోరు.. 69 శాతం పోలింగ్​ నమోదు - తెలంగాణ తాజా వార్తలు

స్వల్ప ఘర్షణలు, చెదురుమదురు ఘటనలు మినహా మినీ పురపోరు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు బారులు తీరారు. ఎండల తీవ్రత, కొవిడ్‌ ఉద్ధృతిలోనూ జనం ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. నగరపాలికల్లో మాత్రం ప్రజలు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్ల పోలింగ్‌ శాతం కాస్త తగ్గింది. పురపాలికల్లో మాత్రం అందుకు భిన్నంగా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పక్కాగా కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేశారు. యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించిన చోట్ల మాత్రం ఓటు వేసే సమయంలో భౌతిక దూరం పాటించలేదు.

మినీ పురపోరు
మినీ పురపోరు

By

Published : Apr 30, 2021, 5:02 PM IST

Updated : May 1, 2021, 4:13 AM IST

రాష్ట్రంలో మినీ పురపాలక పోరు ముగిసింది. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 69.75 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా నకిరేకల్‌ పురపాలక సంఘంలో 86.65 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా, కొత్తూరు పురపాలక సంఘం 85.42 శాతంతో తర్వాత స్థానంలో నిలిచింది. అత్యల్పంగా వరంగల్‌ కార్పొరేషన్‌లో 54.74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో 27.62 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.

నగరపాలక, పురపాలక సంఘాలతో పాటు మరో నాలుగు వార్డులు బోధన్‌ (18), గజ్వేల్‌(12), నల్గొండ (26), పరకాల(9)లకు కూడా ఎన్నిక జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారథి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పురపాలక ఎన్నికల అథారిటీ, పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. పోలింగ్‌ బాక్సులకు పూర్తి భద్రత కల్పించాలని, కిటికీలు, తలుపులు సీల్‌ చేయడంతో పాటు, స్ట్రాంగ్‌ రూంల లోపల, వెలుపల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు మే 3వ తేదీన జరగనుంది.

ఓరుగల్లులో తెరాస.. భాజపా శ్రేణుల గొడవ

వరంగల్‌ మహా నగరపాలక సంస్థలోని 66 డివిజన్లకు ఎన్నిక జరిగింది. మొత్తం 6,64,188 మంది ఓటర్లకు 3,63,573 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవిడ్‌ ప్రభావం ఎన్నికలపై పడింది. శివారు ప్రాంతాల్లో ప్రజలు పోటీపడి ఓటు వేయగా, నగరం నడిబొడ్డున ఉన్న కేంద్రాలు మాత్రం ఓటర్లు లేక బోసిపోయాయి. 34వ డివిజన్‌ శివనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓ భాజపా కార్యకర్త కాషాయం రంగు చొక్కా ధరించి ఉండగా, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ అభ్యంతరం తెలిపారు. వెంటనే కార్యకర్తలు అతని చొక్కా లాగి.. కాలువలో పడేశారు. గీసుకొండ మండలం 16వ డివిజన్‌లోనూ కాషాయ రంగు చొక్కా ధరించిన భాజపా కార్యకర్త చొక్కాను పోలీసులు విప్పించారు. పోలీసులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. వరంగల్‌ ఇస్లామియా కళాశాల సమీపంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి స్వరూపారాణి కుమారుడిపై రాళ్ల దాడి జరిగింది. తెరాస కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తూ కేసు నమోదు చేయాలని మట్టెవాడ పోలీసులను కోరారు. సమ్మయ్య నగర్‌లో పోలింగ్‌ విధులకు వెళుతుండగా గుండెపోటుతో రమేశ్‌బాబు అనే ఉపాధ్యాయుడు మరణించారు.

సిద్దిపేటలో ప్రశాంతం

సిద్దిపేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 43 వార్డుల్లో 1,00,678 ఓటర్లుండగా.. 67,539 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 23వ వార్డులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు శానిటైజర్‌, మాస్కు, చేతి తొడుగు అందేలా ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు.

Last Updated : May 1, 2021, 4:13 AM IST

ABOUT THE AUTHOR

...view details