ఎంఐఎం అడ్డాగా ఉన్న పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పార్టీ అధినేతలు అసద్‌తో పాటు అక్బర్ ఉదయం వేళల్లో పాదయాత్రలు..రోడ్‌షోలు నిర్వహిస్తుండగా సాయంత్రం ఆరు గంటలు మొదలుకొని రాత్రి 10గంటల వరకు విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.
ఈసారి 51 స్థానాలకే పరిమితం
ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 డివిజన్లను గెలుచుకున్న మజ్లిస్ ఈసారి మాత్రం 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రచారానికి వెళ్లిన సమయంలో.. వరద పరిహారం అందలేదనే అంశాన్ని ప్రజలు ప్రస్తావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికైనప్పటికి ప్రధానంగా అక్బర్ రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా..గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం పీవీ,ఎన్టీఆర్ సమాధులను తొలగిస్తారా అంటూ పేదలను తమ వైపు తిప్పుకొనే యత్నం చేశారు. మరో వైపు నిరంతరం ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విపత్తు ఎదురైనా.. అండగా ఉంటామంటున్న మోదీ, కేసీఆర్‌లు.. కనీసం వారి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలైనా కలిసే అవకాశం ఇస్తున్నారా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాతబస్తీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యేలు మొజంఖాన్, ముంతాజ్‌ఖాన్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికీ వెనకాడటం లేదు.
మోదీ లక్ష్యంగా అసద్ ప్రచారం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రధాని మోదీతో పాటు భాజపా లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ఏకంగా చేసే అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ కేంద్ర సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం నిర్వహించినందుకే ఎంఐఎంపై కేంద్రం పగబట్టిందని.. భాజపా గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ దాడులు చేస్తామంటున్నారని ఓటర్లను తమవైపు తిప్పుకొనే యత్నం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో చేపట్టబోయే పనులను వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంటే తనను జిన్నాగా అభివర్ణిస్తున్నారంటూ ఎంపీ అసద్.. పదునైన పదాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
బల్దియా బరిలో మజ్లిస్ జోరు
గతంలో ఎన్నికై పనితీరును కనబర్చని 13 మంది అభ్యర్థులను మార్చినా.. బల్దియా పోరులో తమ స్థానాలు నిలుపుకునేందుకు ఎంఐఎం అన్ని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.