కొవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వలస కార్మికులు అష్టకష్టాలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత లాక్డౌన్ ఎత్తేయడం ఏం వ్యూహమని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని విమర్శించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం లాక్డౌన్ విధించిందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్యానించారు.
ఆరోపణలు అవాస్తవం
తబ్లిగీ నుంచి వచ్చిన కరోనా బాధితులు పూర్తి ఆరోగ్యవంతులయ్యారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. వారిలో 38 మంది... కరోనా సోకిన రోగులకు తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. రోజుకు ఆరుగురి చొప్పున ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. శాంపిల్స్ సేకరించేందుకు ఒక్కక్కరికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన వారితోనే కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందిందని ప్రచారం చేస్తున్న సంఘ్ పరివార్ ఆరోపణలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.