'మిల్లెట్ మాంత్రికులు' మనసు దోచేస్తున్నారు.. millet mantra startup : కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు, అభిరుచులు శరవేగంగా మారిపోతోన్నాయి. కొవిడ్ ప్రభావంతో రోగ నిరోధక శక్తి పెంచే పోషకాహారం తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఇంటి ముంగిటకే నాణ్యమైన సేవలు అందించేకు మిల్లెట్ మంత్ర అనే అంకుర సంస్థ ముందుకొచ్చింది.
millet mantra in Hyderabad : హైదరాబాద్‌కు చెందిన పూజితారెడ్డి బూజల అనే యువతి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కానీ ఏదైనా కొత్తగా చేయాలి... అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని భావించింది. అనుకున్నట్లే 2020లో తన ఫ్రెండ్ కీర్తితో కలిసి మిల్లెట్ మంత్ర అనే బ్రాండ్‌తో అంకురసంస్థ నెలకొల్పింది.
millet mantra in chilakalaguda : ఆధునిక జీవితాల్లో ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి నడుమ ఉంటూ ఉదయం వేళల్లో చాలామంది అల్పాహారం తీసుకోవడం లేదు. పనిచేసే ప్రాంతాల్లో జంక్‌ఫుడ్‌తో ఆకలి తీర్చుకుంటు న్నారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అది గమనించిన ఈ యువతి పూర్తి సహజసిద్ధమైన ఆహారం తయారు చేసింది. దాంతో మనకి ఆగోగ్యంతోపాటు ఆజీర్ణ, ఆకలి వంటి సమస్యలు దరికి చేరవని చెబుతోంది పూజితారెడ్డి.
చిరుధాన్యాలు రుచికరంగా ఉండవని చాలామంది ఆహారంలో భాగం చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ తన ఉత్పత్తులు అందుకు భిన్నం అంటోంది. స్వచ్ఛమైన తాటి బెల్లం, తేనె, బాదం, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ లాంటివి చిరుధాన్యాలతో జోడించి మంచి రుచికరమైన డైట్ ఫుడ్ తయారు చేసింది ఈ యువతి. వేడి నీరు లేదా పాలల్లో కలిపి అప్పటికప్పుడే తినేసి పనులకి వెళ్లిపోవచ్చు అంటోంది.
రాజేంద్రనగర్ జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ - ఐఐఎంఆర్‌లో విభిన్న రుచుల్లో వైవిధ్యభరితంగా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌లో పూజితారెడ్డి శిక్షణ తీసుకుంది. వీరి అంకుర సంస్థ ఏర్పాటుకు ఆ సంస్థే ఆర్థిక చేయూత అందించింది. క్రమంగా సొంత ఫార్ములా తో చేసిన ఈ చిరుధాన్యాల ఉత్పత్తులకు మంచి స్పందన రావడం మొదలైంది.
అనతికాలంలోనే వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజితకు భర్త ధీరజ్‌రెడ్డి తన వంతుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడంతో పాటు లావాదేవీల్లో ఆసరాగా ఉంటున్నాడు.
మొదట్లో పెట్టుబడి, ఉత్పత్తుల తయారీ, రవాణా, మార్కెటింగ్, సిబ్బంది లాంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురైనా అవన్నీ క్రమంగా అధిగమించారు. గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుని దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ చేస్తున్నామని చెబుతుంది పూజితారెడ్డి . త్వరలో హైదరాబాద్, అమరావతిలో "ప్రత్యేక స్టోర్లు" తెరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో డోర్ డెలివరీ సేవలూ అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు.