MILAN 2022 : విశాఖ బీచ్లో జరుగుతున్న మిలాన్-2022 రిహార్సల్ ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పెద్ద సంఖ్యలో నేవీ కుటుంబాల ప్రతినిధులు, సాధారణ ప్రజలు హాజరై.. గగనతలంలో నేవీ యుద్ద విమానాలు, హెలీకాప్టర్లు చేసిన విన్యాసాలను తిలకించారు. గగనతలం నుంచి పారాషూట్లలో దిగిన నావికులు.. భారత శౌర్య పరాక్రమాలను చాటి చెప్పారు. వివిధ దేశాల ప్రతినిధులూ వీటిని వీక్షించారు. అంతర్జాతీయ సిటీ పరేడ్లో భాగంగా నౌకాదళం, త్రివిధ దళాలు కవాతు చేశాయి. ఇందులోనూ వివిధ దేశాల నౌకాదళాల సిబ్బంది కవాతుచేశారు.
అగ్రదేశాల సరసన భారత్
ఆత్మనిర్భర్ భారత్ ద్వారా.. ప్రపంచంలోని తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న 25 అగ్రదేశాల సరసన భారత్ చేరిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు. మిలన్ 2022 ద్వారా మిత్రదేశాల మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా భారత్ నిర్వహిస్తోందని, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ అన్నారు.
మిలాన్ కార్యక్రమం 1995 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడు 4 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లోనూ 39 దేశాల ప్రతినిధులు ఈ మిలాన్ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి మన పూర్వీకులు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. మనందరిది ఒకే కుటుంబం అనే భావన చాటి చెప్పారు. అది విశాఖలో మేము చూశాము.