లాక్‌డౌన్ పొడిగింపుతో ఎక్కడికక్కడా చిక్కుకున్న వలస కూలీల కష్టాలు తారస్థాయికి చేరాయి. కుటుంబంపై బెంగతో కొంతమంది.... ఉపాధి, భోజనం లేక మరికొంతమంది కాలినడకనే ఇళ్లకు బయలుదేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలతోపాటు... తెలంగాణ, తమిళనాడులో పనిచేస్తున్నవాళ్లంతా సైకిళ్లు, బైక్‌లపై, కొంతమంది కాలినడకనే సొంతూళ్ల బాట పట్టారు. తమిళనాడు నుంచి 45 మంది ఒడిశా వాసులు సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు విజయవాడ వరకూ నడిచి వచ్చి అక్కడ సైకిళ్లు కొని ఇంటికి పయనమయ్యారు.
నెల్లూరులో చిక్కుకున్న ఒడిశా వలస కార్మికులకు... ప్రభుత్వం సాయం అందించకపోవటంపై బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది వలస కార్మికులకు రేషన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని, ఇప్పటివరకూ ఎటువంటి సాయమూ అందలేదని ఆయన ట్వీట్ చేశారు. 10 రోజులుగా కనీసం రేషన్ సరుకులు అందించకపోవటంతో... వేరే దారి లేక వారు కాలినడకనే ఒడిశాకు బయలుదేరారని చెప్పారు.
గుజరాత్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో చిక్కుకున్న శ్రీకాకుళం మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారి కుటుంబసభ్యులు కోరారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి చిక్కుకున్నారు. వారు ఫోన్ చేసి భోజనం దొరక్క అల్లాడిపోతున్నామని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు, పాలపాడులకు చెందిన 45 మంది కూలీలు... లాక్‌డౌన్‌కు ముందే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. వారంతా వాహనాన్ని మాట్లాడుకుని స్వగ్రామాలకు బయలుదేరారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులకు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రయాణిస్తున్న వారందర్నీ పోలీసులు క్వారంటైన్ కేంద్రాలకు పంపించారు.