లాక్‌డౌన్‌తో నగరంలో ఉపాధి అవకాశాలు తగ్గి భారీ సంఖ్యలో వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆయా రైళ్ల సమయాలను బట్టి ప్రధాన గేట్ల వద్దే టికెట్లను పరిశీలిస్తున్న అధికారులు.. రిజర్వేషన్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వలస కూలీలు.. - lock down effect on telangana
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం వల్ల వలస కూలీలు స్వస్థలాలకు వెళ్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఒకరోజు ముందుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, పనిలేక, పస్తులుండలేక ఊరి బాట పడుతున్నట్లు కూలీలు చెబుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఒకరోజు ముందుగానే స్టేషన్‌కు వస్తుండటంతో రద్దీ కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులు తప్పితే.. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య తక్కువగానే ఉందంటున్నారు. నిత్యం ఇక్కడి నుంచి 70 వరకు రైళ్లు, 40 వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు స్టేషన్ డైరెక్టర్ జయరాం తెలిపారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీల సంఖ్య 80 శాతం ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉండటంతో.. రద్దీ తగ్గిందని చెప్పారు.