తెలంగాణ

telangana

ETV Bharat / city

పుట్టిన ఊరొచ్చినా పుట్టెడు కష్టాలే

పుట్టి పెరిగిన ఊరిలో పుట్టెడు కష్టాలు అనుభవించారు. తమ జీవితాలకు నగరాలు ఓ దారి చూపుతాయనే గంపెడాశతో వలసబాట పట్టారు. అక్కడ కూలీనాలీ చేసుకుంటూ... అతికష్టంగా కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఆ అభాగ్యుల నెత్తిన కరోనా పిడుగులా పడింది. వారి జీవితాలను లాక్‌డౌన్‌ అతలాకుతలం చేసింది.

migrant-labor-are-facing-many-problems-due-to-lock-down-as-they-dont-get-work
పుట్టిన ఊరొచ్చినా పుట్టెడు కష్టాలే

By

Published : May 25, 2020, 5:07 AM IST

Updated : May 25, 2020, 7:25 AM IST

పనులు దొరక్క, పస్తులకు తాళలేక... పుట్టెడు దుఃఖంతో, కాళ్లీడ్చుకుంటూ ఊరికొస్తే ఇక్కడా కరోనా వల్ల కన్నీళ్లు తప్పడం లేదు. క్వారంటైన్‌లో భాగంగా కొందరు ఊరి బయట, చెట్ల నీడన ఉంటున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచీ తమను వదలని ఆకలితోనే సహవాసం చేస్తున్నారు. ఇక నిర్బంధం ముగిసినా... పలువురు ఇంటి నుంచి బయటకే రావడం లేదు. ఊర్లో చేసేందుకు పనుల్లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఊతమిస్తేనే తమకు ఉపాధి దొరుకుతుందని, ఆకలి దప్పులు తీరుతాయని వేడుకుంటున్నారు.

మొదట్లో సాయం... తర్వాత దూరం

క్వారంటైన్‌ సమయంలో కొందరు వలస కూలీలు... స్థానిక బాధ్యుల నుంచి సరిగ్గా సాయమందడం లేదు. కొన్నిచోట్ల బాధితులు ఊరికి దూరంగా తలదాచుకుంటున్నారు.

వలస వెళ్లినచోట సంపాదించిన కాస్త డబ్బులూ తిరిగి వచ్చేందుకు ఖర్చయ్యాయి. అసలే ఉత్తచేతులతో సొంతూరుకు వచ్చిన వారు ఆకలి తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు సరకులు ఇచ్చినప్పటికీ... అవి 14 రోజుల క్వారంటైన్‌కు సరిపోవడం లేదు. మరోవైపు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కష్టాలు పెరిగాయి. ఊర్లో ఎలాంటి కార్యకలాపాలు సాగడంలేదు.

‘‘ముంబయిలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నాం. కరోనాతో నిజామాబాద్‌ వచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.7వేలు అయ్యాయి. ఊర్లోకి వెళ్లిన వెంటనే అధికారులు 14 రోజుల క్వారంటైన్‌ అన్నారు. ఆ గడువు ముగిశాక గ్రామంలో చేసేందుకు పనుల్లేవు. సొంతూర్లకు తిరిగి వచ్చిన వలస కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి.’’ అని నిజామాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన కూలీలు విన్నవిస్తున్నారు.

సర్పంచి అనుమతిస్తే పనుల్లోకి

మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలానికి చెందిన పిక్యానాయక్‌ పనుల కోసం ముంబయి వెళ్లారు. అక్కడ నిర్మాణ పనులు చేసుకుంటూ ఆరుగురు కుటుంబ సభ్యులను పోషించుకున్నారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వారం రోజుల క్రితం ధన్వాడకు వచ్చారు. ఇక్కడికి రాగానే క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. దీంతో పిక్యానాయక్‌ కుటుంబంతో సహా కొన్నాళ్లు ఊరిబయట మామిడి తోటలో ఉండాల్సి వచ్చింది. ‘సర్పంచి అనుమతిస్తే పొలం పనులు చేసుకుంటాం. పరిస్థితులు చక్కబడితే మళ్లీ ముంబయి వెళ్తాం’ అని చెప్పారు నాయక్‌.

ముంబయి నుంచి నడుచుకుంటూ వచ్చాం

‘‘ఏప్రిల్‌ 21న ముంబయి నుంచి నడక మొదలుపెట్టాం. దారిలో అక్కడక్కడ వాహనదారులను లిఫ్టు అడుగుతూ 3రోజుల తర్వాత జనగాం చేరుకున్నాం. రాగానే వారం రోజులు క్వారంటైన్‌ చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాం. ఇప్పటివరకు దాతలిచ్చిన సరకులతోనే పూట గడిచింది. ఇప్పుడు చేసేందుకు పనుల్లేవు. పస్తులుండాల్సి వస్తోంది. నాతోపాటు చాలామంది వలస కూలీల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం ఆదుకుని పనులు కల్పిస్తే పొట్ట నింపుకుంటాం’’ అని జనగాం వాసి గూడిగల్ల గాలయ్య కోరుతున్నారు.

పనిలేదు... అప్పు పుట్టడం లేదు!

‘‘ఊరికి వచ్చిన వెంటనే అధికారులు 14రోజులు హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. ఆ గడువు ముగిసింది. అయినా ఉపాధి దొరకడంలేదు. కూలీ పనులూ లేవు. అర్థాకలితో ఉండాల్సి వస్తోంది. క్వారంటైన్‌ చేయడంతో ఇరుగుపొరుగు, బంధువులు అదోలా చూస్తున్నారు. చేబదులు కోసం ఎవరింటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సాఫీగా సాగుతున్న జీవనం లాక్‌డౌన్‌ దెబ్బతో ఒక్కసారిగా తలకిందులైంది’’.

రాజు, కొలనుపాక, యాదాద్రి జిల్లా

Last Updated : May 25, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details